Take a fresh look at your lifestyle.

ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై మంత్రి ఆగ్రహం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మంత్రిజూపల్లి కృష్ణారావు

ముద్ర, వనపర్తి :
కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వనపర్తి ఐడీఓసీ (IDOC) కార్యాలయంలో ఏదుల, పాన్ గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీపీఓ, డీఎల్పీఓలతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ, ఏఈలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
గ్రామపంచాయతీలకు వచ్చే నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిధులను ఏ ఏ పనులకు ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలో వివరిస్తూనే, గ్రామాభివృద్ధిలో అధికారుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. అనంతరం నీటి పారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువ లైనింగ్, డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిని సమీక్షించిన ఆయన ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జరిగిన అవకతవకలపై సీఈ, ఎస్ఈ స్థాయి అధికారులను నిలదీశారు. పనుల్లో నాణ్యత లోపించడం, నిధుల దుర్వినియోగంపై అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే ఈ అంశాన్ని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్యాకేజీ-16కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆదేశించిన మంత్రి, త్వరలోనే తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.