కోరుట్ల, ముద్ర;
దేవ, దానవులతో పాటూ సకల జీవులకు వారు చేసుకున్న కర్మఫలం అనుభవించక తప్పదని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అష్టాదశ మహాపురాణ ప్రవచన జ్ఞాన యజ్ఞంలో భాగంగా కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శుక్రవారం ‘శ్రీ వరాహ మహాపురాణ సప్తాహం’ ఐదవ రోజు ప్రవచనం వైభవంగా జరిగింది. మొదట సమితి ప్రచార కార్యదర్శి చలిగంటి వినోద్ పావని దంపతులు, మాడిశెట్టి రవీందర్ జ్యోతి దంపతులు గురు వందనం చేశారు. బ్రహ్మాది దేవతలు, రాక్షసుల గుణగణాలు గత చరిత్ర తెలిసినప్పటికీ వారి తపస్సుకు మెచ్చి అమూల్యమైన వరాలు ఇచ్చారని ప్రవచనంలో భాగంగా మహేశ్వరశర్మ పేర్కొన్నారు. అలా వరాలు ఇచ్చినప్పటికి మళ్లీ వారి ఆగడాలు అణిచివేయడానికి దేవతా శక్తులను ఉద్భవింపజేసిన ఘట్టాలు ఉన్నాయన్నారు. గత జన్మలో వచ్చిన కర్మ ఫలాన్ని ఈ జన్మలో సత్కర్మల ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చని పురాణాల ద్వార చెప్పబడిన సనాతన ధర్మమని మహేశ్వర శర్మ మనోహరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, పురాణ కమిటీ చైర్మన్ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పడిగెల శ్రీనివాస్, పురాణ కమిటీ కన్వీనర్ ఎలిమి బుచ్చన్న, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ పడిగెల పవన్, నిర్వాహకులు వొటారి చిన్నరాజన్న, దొంతుల సుందర వరదరాజన్, రుద్ర సుధాకర్, శక్కరి వెంకటేశ్వర్, చౌడారపు శ్రీనివాస్, శక్కరి వెంకటేష్, ఎనగందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.