Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనల కట్టుదిట్టమైన అమలు: సాధారణ పరిశీలకుడు మయాంక్ మిట్టల్, కలెక్టర్ నారాయణరెడ్డి

సాఫీగా, సజావుగా మున్సిపల్ ఎన్నికలు

ఎన్నికల నిబంధనలు అతిక్రమించొద్దు

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది,

 

ముద్ర ప్రతినిధి – ఉమ్మడిరంగారెడ్డి జిల్లా

బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు మయాంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి సంబంధించి శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని ప్రక్రియను పరిశీలించారు.

నిబంధనలు అతిక్రమించొద్దు : మయాంక్ మిట్టల్
పోలింగ్ విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను తూ చ తప్పకుండా అనుసరించాలని ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మయాంక్ మిట్టల్ ఆదేశించారు. చెక్ లిస్ట్ ప్రకారం ఎన్నికల సామగ్రిని సరిచూసుకున్న తరువాతనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బయలుదేరి వెళ్లాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువు లోపు పోలింగ్ కేంద్రం లోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5.00 గంటలు దాటిన తరువాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించామని మిట్టల్ తెలిపారు

పక్కగా పోలింగ్ సామాగ్రి పంపిణీ : కలెక్టర్ నారాయణరెడ్డి
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉండాల్సిన సామాగ్రిని సిద్ధం చేసి పక్కగా అన్ని పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించాలని ఆదేశించారు. చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల సామాగ్రి అందినదా? లేదా? అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలు సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఏమైనా లోపాలు కనిపిస్తే పోలింగ్ సిబ్బంది వెంటనే తెలియజేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది నిర్వహించే వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు. శేరిగూడలో మండల్ పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమును మయాంక్ మిట్టల్ ల్ తో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో విస్తృత బందోబస్తు : మహేశ్వరం డిసిపి
మహేశ్వరం డిసిపి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత కల్పించడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి,ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————————-

Leave A Reply

Your email address will not be published.