Take a fresh look at your lifestyle.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) ను సందర్శించిన టి-సాట్ సీఈవో

మాదాపూర్, ముద్ర : హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) ను టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గురువారం సందర్శించారు. న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ సీఈవో బృందానికి స్వాగతం పలికారు. న్యాక్ ఆధ్యర్యంలో సివిల్, ఎలక్ర్టిసిటీ, ప్లంబింగ్, సినిమాటోగ్రఫీ తదితర స్వయం ఉపాధి కోర్సులలో శిక్షణ నిర్వహిస్తోన్న విభాగాలను సందర్శించి శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతోన్న న్యాక్ లో నిరుద్యోగయువతకు నైపుణ్య శిక్షణ గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడి వారి శిక్షణ అనుభావాలను, శిక్షణ పూర్తయ్యాక భవిష్యత్ ఆలోచనల గురించి సీఈవో తెలుసుకున్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగ, ఉద్యోగ యువతకు సివిల్ వర్క్ లో వృత్తి నైపుణ్యం పై శిక్షణ ఇచ్చామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు సీనిమాటోగ్రఫీ లో యువతకు శిక్షణ ఇస్తున్నామని డైరెక్టర్ శాంతిశ్రీ సీఈవో కు వివరించారు. గ్రామీణ ప్రాంత యువతకు వారి అభిప్రాయాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేందుకు న్యాక్ ఎంతగానో దోహదపడుతోందని వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. యువతకు న్యాక్ లో జరిగే నైపుణ్య శిక్షణను డిజిటల్ రూపంలో టి-సాట్ ద్వార ప్రసారం చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు టి-సాట్ సీఈవో మరియు న్యాక్ డైరెక్టర్ శాంతిశ్రీ ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.