హోటల్, పబ్, ఈవెంట్ మేనేజర్లకు సూచించిన డీసీపీ వినీత్
మాదాపూర్, ముద్ర: శాంతి భద్రత విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పోలీసులకు సహకరించాలని మాదాపూర్ డీసీపీ జి.వినీత్ సూచించారు. ఇటీవల ప్రిజం పబ్ లో జరిగిన ఘటనను సందర్భంగా మాదాపూర్ పరిధిలోని హోటళ్లు, పబ్ లు, ఈవెంట్ మేనేజర్లతో గురువారం డీసీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తరచూ జరిగే అనుకోని సంఘటనల విషయాల్లో అనుమానిత వ్యక్తులు పట్ల హోటళ్లు, పబ్ లు, ఈవెంట్ మేనేజర్లు అప్రమత్తంగా ఉండటమే కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు కన్పించినపుడు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు సోదాలు నిర్వహించినపుడు సైతం సహకరించాలని, నేరస్థులకు, అనుమానిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించినట్లైతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుమారు 200 మంది మేనేజర్లు, యజమానులు హాజరైన సమావేశంలో అడిషనల్ డీసీపీ జయరాం, ఏసీపీ శ్రీకాంత్, ఎస్.హెచ్.వో లు క్రిష్ణమోహన్, హబీబుల్లా, రమణ తదితరులు పాల్గొన్నారు.
