ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ స్వీయ జనగణనపై ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాతలతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాలు, 460 గ్రామాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 86 వార్డుల్లో జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 2011 తర్వాత జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడగా, ప్రస్తుతం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సెన్సస్-2027 ప్రక్రియను ప్రారంభించాయని పేర్కొన్నారు. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడం విశేషమన్నారు.
ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు జరుగుతున్న తొలి దశ స్వీయ గణనలో ప్రజలు శాతం వంద పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు కంప్యూటర్, మొబైల్, టాబ్ ద్వారా ఆన్లైన్లో తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. జిల్లాలో సుమారు 2500 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు.
స్వీయ గణన పూర్తయ్యాక ప్రతి కుటుంబానికి రిఫరెన్స్ (SE ID) నంబర్ అందుతుందని, తరువాత ఇంటికి వచ్చే గణన అధికారికి ఆ నంబర్ చూపిస్తే వివరాలను ధృవీకరించి తుది ఆమోదం ఇస్తారని వివరించారు. స్వీయ గణన చేయని వారి వద్దకు గణన అధికారులు వెళ్లి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు.
రేషన్ కార్డులు, పింఛన్లు, గృహ పథకాలు, ఓటరు గుర్తింపు కార్డులతో జనగణనకు ఎలాంటి సంబంధం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ప్రభుత్వాలకు కేవలం గణాంకాల రూపంలో మాత్రమే సమాచారం అందుతుందని హామీ ఇచ్చారు.
జనగణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉండగా, స్వీయ గణనలో 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వవచ్చని, మిగిలిన ప్రశ్నలను గణన అధికారి నమోదు చేస్తారని తెలిపారు. ఇంటి నంబర్, ఆధార్, ఆస్తుల వివరాలు వంటి అంశాలు అడగరని స్పష్టం చేశారు.
మీడియా ప్రతినిధులు ముందుండి స్వీయ గణన పూర్తి చేసి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ కోరారు. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా సహకారం అవసరమన్నారు.
స్వీయ గణన విధానం ప్రకారం అధికారిక వెబ్సైట్లో Self Enumeration Login ద్వారా నమోదు ప్రక్రియ ప్రారంభించి, కుటుంబ వివరాలు నమోదు చేసి, OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేసి, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి చివరగా SE ID పొందాలని సూచించారు.
మే 11 నుంచి గణన అధికారులు ఇంటికి వచ్చి ఈ వివరాలను ధృవీకరిస్తారని, రెండో దశలో వ్యక్తుల వారీగా పూర్తి వివరాలు నమోదు చేయబడతాయని కలెక్టర్ తెలిపారు.
జనగణన ద్వారా అభివృద్ధి ప్రణాళికలు, వనరుల సమన్వయం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఖచ్చితమైన గణాంకాలు లభిస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ గర్వంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.