Take a fresh look at your lifestyle.

ఇందిరా డెయిరీ గేదెల కొనుగోలు పారదర్శకంగా జరగాలి

  • అదనపు కలెక్టర్ స్థాయి అధికారికి బాధ్యత.
  • చెరువులు, పర్యాటక అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవండి.
  • అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మధిర, ముద్ర విలేఖరి : మధిర నియోజకవర్గానికి ప్రతిష్టాత్మకమైన ఇందిర కో ఆపరేటివ్ డెయిరీ పథకం కింద కీలకమైన గేదెల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని మధిర శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మధిర నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరా డెయిరీ, చెరువులు- పర్యాటక రంగం పనుల అభివృద్ధిపై విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా కో-ఆపరేటివ్ డెయిరీ ప్రాజెక్టులో గేదెల కొనుగోలు అనేది కీలకమైన అంశమని, కొనుగోలు ప్రక్రియ అదనపు కలెక్టర్ స్థాయి అధికారి తో పాటు డి ఆర్ డి ఎ పిడి పర్యవేక్షణలో జరగాలని ఆదేశించారు.కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి పొరపాట్లు జరిగిన సంబంధిత అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు.గేదెలు ఎక్కడ, ఏవి కొనుగోలు చేయాలి అనేది లబ్ధిదారుల నిర్ణయానికి వదిలివేయాలని ఆదేశించారు.20 వేల మంది లబ్ధిదారులు, 40 వేల గేదెలతో డెయిరీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో గేదెలకు అవసరమైన గడ్డి పెంపకం, అవసరమైన స్థలం పైన సమీక్ష చేశారు. గేదెలు కొనుగోలు చేసే సమయంలో ఇన్సూరెన్స్ చేయించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించేటప్పుడు అందరినీ ఆహ్వానించాలని, అదనపు ఆదాయం సృష్టించడం, గేదెల సంరక్షణ, పాల సేకరణ, మార్కెటింగ్ తదితర అంశాల అన్నిటి పైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.పాల వ్యాపారంలో లబ్ధిదారులకు అవగాహన కలిగించేందుకు ముల్కనూరు,విజయ వంటి డెయిరీ ల సందర్శనకు దశలవారీగా తీసుకువెళ్లాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.డెయిరీ నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి కార్యాలయం, సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.సలహాదారును వెంటనే నియమించాలని కోరారు. డెయిరీ కమిటీ సభ్యులు కనీసం వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.లబ్ధిదారుల ఇళ్లల్లో గేదెల సంరక్షణకు షెడ్ల నిర్మాణం, పచ్చి, ఎండు గడ్డి లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా సరఫరా చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల పైన సమీక్షించారు. గేదెలకు నిరంతరం ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు నిర్వహించేందుకు ప్రతి మండలానికి రెండు పశు వైద్య అంబులెన్సులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

  • చెరువులు – పర్యాటక అభివృద్ధికి వెంటనే టెండర్లు పిలవండి.

మధిర, జమలాపురం చెరువులను టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని డిప్యూటీ సీఎం నీటిపారుదల, పర్యటక శాఖ అధికారులను ఆదేశించారు.ఈ చెరువుల పరిధిలో టూరిజం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న కాటేజీలు, బోట్స్, మినీ హాల్స్ కు సంబంధించిన డిజైన్లను డిప్యూటీ సీఎం పరిశీలించారు.వీటితోపాటు మాటూరు, ఈనిద్రము బయ్యారం, కలకోట, చిరుమర్రి, ముత్తారం, చింతకాని చెరువులు,- పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రగతిని ఈ సమావేశంలో సమీక్షించారు.\సమావేశంలో డిఆర్ డి ఓ సన్యాసయ్య, సెర్ప్ సరిత, నీటిపారుదల శాఖ అధికారులు సి ఈ రమేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఈ ఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.