Take a fresh look at your lifestyle.

తెలంగాణా జరూర్ ఆనా..! మిస్ వరల్డ్ పోటీలకు వేళాయె!

  • హైదరాబాద్ చేరుకున్న 109 దేశాల ప్రతినిధులు.
  • సుందరీమణుల రాకతో కళకళలాడుతోన్న నగరం.
  • శనివారం నాడు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభం.
  • ఈనెల 31న హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే.
  • 13వ తేదీన ఓల్డుసిటీలో హెరిటేజ్ వాక్.
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
  • అతిథులు బస చేసే ప్రాంతాలను రెడ్, గ్రీన్ జోన్లుగా విభజన.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ నగరం వేదికగా మారింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వ ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపట్నుంచి (శనివారం) గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ -2025 పోటీలు మొదలుకానున్నాయి. ఎయిర్ పోర్టు సహా హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ నగరానికి చేరుకున్నారు. ఇతర దేశాల నుంచి ఇంకా పోటీదారులు రానున్నారు. శుక్రవారం నాటికి వారందరు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది.భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాతో పాటు, అథెన్నా క్రాస్బీ (అమెరికా), ఎమ్మా మోరిసన్ (కెనడా), వాలేరియా కాన్యావో (వెనిజులా) వంటి ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. అమెరికా, దక్షిణాఫ్రికా, వెనిజులా వంటి ప్రముఖ దేశాలతో పాటు గ్వాడలూప్, గిబ్రాల్టర్, మార్టినిక్, క్యురాకావ్ వంటి చిన్న దేశాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడం గమనార్హం. విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, సామాజిక వేత్తలు, కళాకారులు, ఉద్యమకారులుగా ఉన్న పోటీదారులు తమ దేశాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోటీదారులు దాదాపు నెల రోజుల పాటు తెలంగాణలోని పర్యాటక, సాంస్కృతిక, వైద్య, చేనేత, ఆవిష్కరణ కేంద్రాలను సందర్శించనున్నారు.మే 31న హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా గ్రాండ్ ఫినాలే జరగనుంది.ఈ పోటీల సందర్భంగా తెలంగాణ జరూర్ ఆనా (తప్పకుండా తెలంగాణకు రండి, పర్యటించండి) అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తెలంగాణలోని పర్యాటక రంగం వృద్ధి చెందడం, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోటీలపై అన్ని రాష్ట్రాలలోని ప్రధాన ఎయిర్ పోర్టులలో ప్రచారం కల్పించారు. అలాగే సామాన్యులు సైతం ఈ పోటీలను తిలకించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ వెబ్ సైట్‌లో పేర్లను నమోదు చేసుకున్న వారికి ఐదు కేంద్రాల్లో వేయి మందికి చొప్పున మొత్తం ఐదువేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.

  • 13న ఓల్డుసిటీలో మిస్ వరల్డ్ వాక్.

మిస్ వరల్డ్ -2025 పోటీల్లో భాగంగా ఈనెల 13న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్ లతోపాటు ఇక్కడ సాంస్కృతిక వైభవాన్ని, చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్‌లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు.120 దేశాల మిస్ వరల్డ్ ప్రతినిధులు హాజరయ్యే ఈ హెరిటేజ్ వాక్ ను 150 కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా ప్రమోట్ చేయనున్నారు.

  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.

ఈనెల 10 (శనివారం) నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. అతిథులకు కేటాయించిన హోటల్స్ వద్ద భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు.అతిథులు బస చేసే పరిసరాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్లుగా కేటగిరి చేశారు.హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భద్రతా సిబ్బందిని నగరానికి రప్పించారు.120 దేశాలకు పైగా మిస్ వరల్డ్ ప్రతినిధులు ఓల్డుసిటీ హెరిటేజ్ వాక్ నేపధ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.సాధారణ రోజుల్లో సైతం ఓల్డుసిటీ సమస్యాత్మక ప్రాంతం కావడం, అందులోనూ ప్రస్తుతం ఇండియా,పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేధపధ్యంలో ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్ పై తెలంగాణ పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. మిస్ వరల్డ్ ప్రతినిధులు వాక్ చేసే ప్రాంతాన్ని ఇప్పటి నుండి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తుల రాకపోకలపై నిఘాపెట్టారు. హెరిటేజ్ వాక్ కు 24 గంటల ముందునుండే భద్రతా బలగాలు హెరటేజ్ వాక్ జరిగే ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.