- మీకు స్వాతంత్ర ఇచ్చిందే మేం.
- తల్చుకుంటే ప్రపంచ పటంలో మీ దేశమే ఉండదు.
- సంఘాభావ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని ఏ దేశమైనా మట్టిలో కలుపాల్సిందేనని, భారత సార్వభౌమత్వం మీద దాడి చేయాలని చూసేవారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. భారత పౌరులు తల్చుకుంటే పాకిస్థాన్ ను మట్టిలో కలిపేస్తామని, కానీ సంయమనం పాటిస్తున్నామన్నారు. అసలు పాకిస్థాన్‌కు మీకు స్వాతంత్రం ఇచ్చిందే తామని, ఈ దేశం తల్చుకుంటే పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదని హెచ్చరించారు.దేశ సింధురాన్ని తుడిపేయాలనుకుంటే ఆపరేషన్ సిందూరే పాకిస్థాన్‌కు సమాధానమని కౌంటర్ ఇచ్చారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగింది.జాతీయ జెండాలను చేతబూని ర్యాలీగా ముందుకు సాగారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ విజయశాంతి, సచివాలయ ఉద్యోగులు, మాజీ సైనికాధికారులు, భారీ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ అంశంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఉగ్రమూకలకు ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘పాక్ ఉగ్రవాదులు, పాక్ పాలకులు, అంతర్జాతీయ ముఖచిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకుంటే..ఈ భూమ్మీద మీకు నూకలు చెల్లినట్లే. ఈ భూమ్మీద మీరు నివసించేందుకు అర్హత కోల్పోయినట్లే. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు. భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఉగ్రవాదుల పీచమణచేందుకు ఏ చర్య తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఇదీ భారతీయుల స్ఫూర్తి’’ అని అన్నారు.

బ్రిటిష్ వాళ్ల నుంచి శాంతి ద్వారానే భారత్‌తో పాటు పాక్‌కు కూడా స్వేచ్ఛా వాయువులు అందించి అమరుడయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.మహాత్ముడు ఇచ్చిన చేసిన శాంతియుత పోరాటం వల్లే దేశం ఈరోజు స్వేచ్ఛను అనుభవిస్తుందని, ఆయన శాంతి సిద్ధాంతాన్ని పుణికి పుచ్చుకున్న భారతీయులు శాంతిని కోరుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే దిశగా కొనసాగుతున్నారన్నారు. శాంతి ఆకాంక్షను చేతగానితనంగా భావించి ఎవరైనా మా భూభాగంలో కాలుమోపి.. ఇక్కడి ఆడబిడ్డల నుదుట సిందూరాన్ని తుడిచేయాలని అనుకుంటే ఆపరేషన్ సిందూరే మీకు సమాధానం అని హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారానే పాక్ ఉగ్రవాదులను నేలమట్టం చేసే శక్తి దేశ వీర జవాన్లకు ఉందని, ఆ వీర జవాన్‌లకు 140 కోట్ల భారతీయులు అండగా నిలబడతారని ఈ ర్యాలీ ద్వారా సందేశం ఇవ్వదలచుకున్నాం అని అన్నారు. జవాన్లకు అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉన్నామన్నారు.

