మాదాపూర్, ముద్ర: ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేశాక విద్యార్థులు ఏ కోర్సు చదవాలనే సందిగ్ధం వీడేందుకు టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇంటర్ విద్య పూర్తి చేశాక ఏ కోర్స్ చదవాలి, సైన్స్, మ్యాథ్స్ లేదా ఏ ఇతర వృత్తి విద్య కోర్సులు ఎంచుకోవాలనే విషయమై అవగాహన కల్పించేందుకు తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో నిర్మాణ్ మరియు ఆస్మాన్ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఈ నెల 28వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 11 గంటల నుండి టి-సాట్ నిపుణ లో జరిగే ప్రత్యేక లైవ్ కార్యక్రమంలో ఇదే అంశంపై నిపుణులు ప్రత్యేక సలహాలు-సూచనలు అందించనున్నారు. సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థులు ఈ యేడాది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారని, వారి భవిష్యత్ ను నిర్ణయించే సరైన నిర్ణయాన్ని సూచించే విధంగా ప్రసార కార్యక్రమం ఉంటుందని, కార్యక్రమాన్ని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగపరుచుకోవాలని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో కోరారు.లైవ్ ప్రసారాలు టి-సాట్ నెట్వర్క్ చానళ్లతో పాటు టి-సాట్ యాప్, యూట్యూబ్ లో అందుబాటులో ఉంటాయన్నారు.భారత రాజ్యాంగంపై ప్రత్యేక ప్రసారాలు
భారత పౌరులు అత్యంత ప్రాధాన్యంగా భావించే భారత రాజ్యాంగంపై టి-సాట్ ప్రత్యేక ప్రసారాలు అందించనుంది. భారత రాజ్యాంగం రూపకల్పన, నిర్మాణం, ప్రాథమిక సూత్రాలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సంబంధాలు తదితర ప్రధాన అంశాలపై అరగంట నిడివిగల సుమారు 15 ఏపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.మార్చి 29వ తేదీ శనివారం మధ్యాహ్నాం ఒంటి గంట నుండి ఒంటి గంటన్నర వరకు నిపుణ, అదే రోజు ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు విద్యలో ప్రసారమౌతాయి. రాజ్యాంగాన్ని రూపొందించి సుమారు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్త సమాజానికి రాజ్యాంగం ప్రాధాన్యతలు తెలియజెప్పేందుకు టి-సాట్ ప్రయత్నిస్తోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత తప్పనిసరిగా వినియోగించుకోవాలని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సూచించారు.
Prev Post