Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్లు పకడ్బందిగా జరగాలి

  • సన్న రకం 99,729 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం.
  • బయట రాష్ట్రాల దాన్యం రాకుండ 8 చెక్ పోస్టులు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జులు, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు కొలతలు, రవాణా, మార్కెటింగ్‌ శాఖల ఆధికారులు, రైస్‌ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం దాన్యం 1,84,502 మెట్రిక్ టన్నులు కాగా, అందులో సన్న రకం 99,729 మెట్రిక్ టన్నుల దాన్యం వస్తుందనే అంచనాతో 144 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అవసరాన్ని బట్టి అదనపు దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతన్న పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏ, బి గ్రేడ్ రకాలుగా విభజించి మద్దుతు ధర ప్రకటించినట్లు చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2320, బి గ్రేడ్ రకానికి రూ. 2300 మద్దుతు ధర నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, హమాలీలు వడ దెబ్బకు గురి కాకుండా టెంట్లు, షెడ్‌ నెట్‌లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి నీడ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ నియంత్రణకు వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ చేసిన ప్రకారం రైతులకు టోకెన్లు జారీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాటుపై చెక్ లిస్టు జారీ చేస్తామని, దాని ప్రకారం ఏర్పాట్లు చేసి ధృవీకరణ నివేదికలు అంద చేయాలని చెప్పారు. మన జిల్లాకు సమీప రాష్ట్రాల నుండి దాన్యం వచ్చే అవకాశం ఉన్నందున నియంత్రణకు సరి హద్దులో 8 చెక్ పోస్టులను ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి దాన్యం గింజను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన దాన్యాన్ని ఏ రోజు కారోజు ఆన్లైన్ చేసి రైస్ మిల్లులకు తరలించాలని దిగుమతిలో జాప్యం జరుగ కుండా రైస్ మిల్లర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కొనుగోలు ప్రక్రియపై ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, దాన్యం విక్రయాల నిర్వహణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.అనంతరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ధాన్యం మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్య చందన, డిఆర్డిఓ విద్యచందన, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్, పౌర సరఫరాల అధికారి రుక్మిణి, డిసిఓ కుర్షిథ్ , వ్యవసాయ అధికారి బాబురావు , జిసిసి మేనేజర్ విజయ కుమార్, తూనికలు కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రెస్ మిలర్ అసోసియేషన్ నుండి ఆనంద రావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.