ముగ్గురు మృతి బాధాకరం: మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కుల్చారం మండలం రాంపూర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామాల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య జరిగాయి. హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (50), అతని కుమారుడు రిషి వర్ధన్ గౌడ్ (12), కూతురును ఇచ్చిన బి. భూపతిపూర్ గ్రామానికి చెందిన అల్లుడు సాయాగౌడ్ (35)లు కుల్చారం మండలం రంగంపేట గ్రామంలో జరిగిన తమ బంధువు ఇంట్లో తొట్టెల కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మెదక్-హైదరాబాద్ 765డి జాతీయ రహదారిపై రాంపూర్ శివారులో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. తండ్రి కుమారుడు అమృత్ గౌడ్, అతని కుమారుడు రిషి వర్ధన్ గౌడ్ అంత్యక్రియలు బూరుగుపల్లిలో ఒకే చోట నిర్వహించారు. అల్లుడు సాయాగౌడ్ అంత్యక్రియలు స్వగ్రామం బి. భూపతిపూర్ లో నిర్వహించారు. రెండు గ్రామాల్లో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కన్నీటి రోధనలు మిన్నంటాయి.

ఎమ్మెల్యే రోహిత్ దిగ్భ్రాంతి
ప్రమాదంలో ముగ్గురి మరణం పట్ల ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు కుటుంబాలను పరామర్శించారు. భూపతిపూర్ లో సాయాగౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య, తల్లిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల బాధను చూసి భావోద్వేగానికి ఆయన గురయ్యారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. వెంట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పరశురాం గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, బూరుగుపల్లి సర్పంచ్ సాయిలు, మండల పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, బాలకిషన్ రావ్, సాయి బాబా తదితరులున్నారు.
ముగ్గురు మరణించడం చాలా బాధాకరం: పద్మ దేవేందర్ రెడ్డి
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బూరుగుపల్లిలో అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్ పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఒకే ప్రమాదంలో తండ్రి, కుమారుడు, అల్లుడు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమన్నారు. అనంతరం బొగుడ భూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయ గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య, తల్లిని ఓదార్చారు.
ఈ సందర్బంగా ఇరు కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
వెంట బూరుగుపల్లి మాజీ సర్పంచ్ చెన్నగౌడ్, హవెలిఘనపూర్ సర్పంచ్ సాయిలు, నాయకులు బాలరాజ్, రవీందర్ గౌడ్, సాపసాయిలు, రాంచంద్రం రెడ్డి, రాఘవ రెడ్డి, జీవన్ రెడ్డి,యాదగిరి, లక్ష్మిపతి, అరవింద్, కుమార్, సంతూ, శ్రీశైలం తదితరులు ఉన్నారు.