ముద్ర ప్రతినిధి, మెదక్:
సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్లో సామాజిక ఉద్యమ సారధుల జయంతి ఉత్సవాల సందర్బంగా రాజ్యాంగం పరిరక్షణ – సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ అధ్యక్షతన జరిగిన సెమినార్ లో ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలా అధోగతి పట్టించి, సహజ వనరులతో సహా ప్రజా ధనాన్ని కార్పొరేట్లకు దోచిపెడుతూ ప్రజల్లో మత, కుల వైషమ్యాలను పెంచి పోసిస్తుందని ద్వజమెత్తారు.

బీజేపీ పాలనలో ప్రమాదంలో పడ్డ దేశాన్ని రక్షించుకొనేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫెడరల్ స్ఫూర్తికి మోడీ సర్కారు విఘాతం కలిగిస్తోందన్నారు. సోదర భావంతో మెలగాల్సిన ప్రజల్లో మతం చిచ్చుపెట్టి లౌకికతత్వానికి ముప్పు తెచ్చిపెట్టిందన్నారు. రాజ్యాంగానికి మూల స్తంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన, సమాఖ్య వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందన్నారు. భారత దేశ సమగ్రత, ప్రజాస్వామ్య భద్రత లౌకికవాదంతో ముడిపడి ఉంది. రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొన్నదనీ తెలిపారు. అయితే హిందూ- ముస్లింల మధ్య అగాధాన్ని సష్టించి మెజారిటీ హిందూ మత పార్టీగా ఉండాలని బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నదని తెలిపారు. దేశాన్ని మనుషులుగా చూసి, వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారిని కులాలుగా, మతాలుగా విడగొట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టే కుతంత్రం బీజేపీలో దాగి ఉన్నదన్నారు. కుల మతాలకు అతీతంగా పౌరుడిని పౌరుడిగా గుర్తించాలన్న రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోందని తెలిపారు.ఈ సెమినార్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె. మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె. సంతోష్ కుమార్, సిపిఎం నాయకులు కె. యశోద, కవిత, యాదగిరి, దుర్గ, స్వరూప, చంద్రం, కిష్టయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు