ముద్ర మల్కాజిగిరి
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నేరేడ్మెట్, వాయిపూరి ప్రాంతంలో హెల్మెట్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ లక్ష్మి తెలిపారు.
హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను పోలీసులు ఆపి ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా రక్షిస్తుందో వివరిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా తాత్కాలికంగా హెల్మెట్లు అందజేశారు.
సాయంత్రం వరకు అందజేసిన హెల్మెట్‌ను వినియోగించి, అనంతరం కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా రైడర్లలో బాధ్యతాభావం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ నటసింహ, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.