Take a fresh look at your lifestyle.

చండికాదేవిగా దర్శనమిస్తున్న నిమిషాంబికా తల్లి

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: శ్రీ  దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగోరోజున శ్రీమాతా నిమిషాంబికా దేవి  అమ్మవారు చండికా దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పరమశివుని ఉగ్రరూపంగా  చండికాదేవి దుష్టశక్తులను నాశనం చేసే శక్తిస్వరూపిణిగా ఆమె భక్తులకు అభయమిచ్చారు. శత్రువులను సంహరించడం,  రుణాలు, వ్యాధులు, ప్రమాదాల వంటి సమస్త కష్టాల నుంచి భక్తులను రక్షించే దేవతగా ఆమె పూజలందుకుంటున్నారు. ఈ రూపంలో అమ్మవారిని చండీదేవిగా, చాముండికగా, చండేశ్వరిగా, చండాయుధగా, చండరూపగా వివిధ స్తోత్రాలలో ముఖ్యంగా శరన్నవరాత్రుల సందర్భంగా కొలుస్తారు. అనంత శక్తి స్వరూపిణిగా అమ్మవారు సమస్త జగత్తుకు శక్తి ప్రదాతగా, మహాదేవిగా, పరమేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి చండికాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న శ్రీ నిమిషాంబికా మాతను వేలాదిగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఆలయంలో ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకులు ఉమాకాంత శర్మతో పాటు ఇతర అర్చకులు భక్తులకు దర్శనం కల్పించడంతో పాటు గోత్రనామాదులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు  కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు ఏర్పాట్లు చేశారు.  నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.