తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి పార్టీ జాతీయ నాయకత్వం నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ జాతీయ నాయకులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు రేవంత్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడి అభినందనలు తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధి, సుస్థిర పరిపాలన, సామాజిక సాధికారత కోసం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, రాష్ట్ర ప్రజల పురోభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఖర్గే ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమ్మిళిత వృద్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన ఆమోదముద్ర వేశారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు రాహుల్ గాంధీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రజల తెలంగాణ కోసం కాంగ్రెస్ దార్శనికత స్పష్టంగా ఉందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరే లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.
లోక్‌సభ సభ్యురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుల నిబద్ధతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి కుటుంబం అభివృద్ధి దిశగా సుసంపన్నమైన తెలంగాణను నిర్మించాలన్న కాంగ్రెస్ సంకల్పానికి ఈ విజయం మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు.
ఎన్నికల్లో ఈ ఘన విజయం కాంగ్రెస్ నమూనా పరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్స్) కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బలమైన నాయకత్వం, పార్టీతో సమన్వయంతో ఈ ఘన విజయం సాధ్యమైందని ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మానిక్కం టాగోర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచారని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కోశాధికారి విజయ్ వసంత్ తెలిపారు. కింది స్థాయి వరకు కాంగ్రెస్ ప్రజల్లో బలంగా వేళ్లూనుకుందని ఈ ఎన్నికల ఫలితాలు తార్కాణమని అన్నారు.
ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ పనితీరుకు ప్రజల ఆమోదానికి ఇది నిదర్శనమని ఆల్ ఇండియా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి సచిన్ సావంత్ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. ఇటీవలి ఉపఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు తిరుగులేని విజయాన్ని చేకూర్చారని పేర్కొన్నారు.