విజ్ఞానం.. ప్రయోగశాలల గోడల మధ్య పరిమితం కావొద్దు ఆవిష్కరణలు ప్రాయోగిక ఫలితాలుగా మారాలి-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
విజ్ఞానం.. ప్రయోగశాలల గోడల మధ్యే పరిమితం కాకూడదని, పరిశోధన ప్రచురణల వరకే ఆగిపోకూడదని, ఆవిష్కరణలు ప్రాయోగిక ఫలితాలుగా మారాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2047 నాటికి.. భారత్ సాంకేతిక స్వావలంబన కలిగిన, పరిశోధన ప్రాధాన్యమున్న, సుస్థిరత ఆధారిత దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. వినియోగంతో కాకుండా సృష్టితోనే శాశ్వత వృద్ధి సాధ్యపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని రీసెర్చ్ హైట్స్ ఫౌండేషన్ నిర్వహించిన సస్టైనబుల్ భారత్ 2047 కోసం పరిశోధన, డీప్ టెక్నాలజీల జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన భారత్ ప్రస్తుతం కీలకమైన “డీప్-టెక్ క్షణం”లో నిలిచిందన్నారు. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ వ్యవస్థలు, వాతావరణ సాంకేతికతలు, ఆధునిక తయారీ, భౌగోళిక మేధస్సు వంటి రంగాల్లో జరుగుతున్న పురోగతులు రాబోయే దశాబ్దాల్లో దేశ పోటీతత్వాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. డీప్ టెక్నాలజీలు ఐచ్ఛికం కాదన్న మంత్రి.. అవి జాతీయ పురోగతికి అత్యవసరమన్నారు. నేడు ఈ రోజు పరిశోధనలో పెట్టుబడి పెట్టే దేశాలే భవిష్యత్తులో నాయకత్వం వహిస్తాయని చెప్పారు. పరిశ్రమలు వాస్తవ సమస్యలను గుర్తించాలన్న మంత్రి.. అకాడెమియా మిషన్ మోడ్‌లో స్పందించాలన్నారు. దీనికి ప్రభుత్వం అనుకూల విధానాలను అమలు చేయాలి అని సూచించారు. ఈ మూడు వర్గాల సమన్వయం వ్యవస్థీకృతంగా మారినప్పుడే ఆవిష్కరణ రూపాంతరం చెందుతుందని వెల్లడించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత నిర్ణయ వ్యవస్థలు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా ప్రజాసేవలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పారు. సస్టైనబుల్ భారత్‌కు సమర్థవంతమైన, వాతావరణ స్పందన కలిగిన, డిజిటల్‌గా అనుసంధానమైన మౌలిక వసతులు అవసరమని పేర్కొన్నారు. దేశ ఆవిష్కరణ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందన్న మంత్రి.. రక్షణ పరిశోధన, బయోటెక్నాలజీ, ఔషధ తయారీ, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ కీలక కేంద్రంగా ఎదిగిందని అన్నారు. పరిశోధనను వ్యాపారంగా మార్చే విధానాలు, స్టార్టప్‌లకు మద్దతు, ఉపాధి సృష్టి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. విశ్వవిద్యాలయాలు డిగ్రీల కర్మాగారాలుగా కాకుండా మేధో సంపత్తి, స్టార్టప్ ఇంక్యుబేషన్, సాంకేతిక వాణిజ్యీకరణకు కేంద్రాలుగా మారాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా మన దేశంలో ఉందన్నారు. పరిశోధన సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగ సంస్కృతి పెంపొందితేనే అది జాతీయ శక్తిగా మారుతుందని వివరించారు. అందుకు డిగ్రీ సంస్కృతి నుంచి డిస్కవరీ సంస్కృతికి మారాలన్నారు. పరీక్షల కేంద్రిత దృష్టి నుంచి ప్రయోగాల కేంద్రిత దృష్టికి అడుగులు వేయాలని చెప్పారు. సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి ఆవిష్కరణ ఆధారిత వ్యవస్థగా మారాలన్నారు.