బీజేపీ పార్టీలోనే కొనసాగుతా పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు – మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
ముద్ర ప్రతినిధి, మేడ్చల్ జిల్లా :
పార్టీ మారుతున్నట్లు తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. మేము పార్టీ మారుతున్నామని,మళ్ళీ కేసీఆర్ తో కలుస్తామని కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారు…ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం శామీర్‌పేట్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఈటల రాజేందర్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. నన్ను కేసీఆర్ బీఆర్‌ఎస్ నుండి పంపించి ఐదేళ్లు అయ్యిందని,అప్పటి నుంచి బీజేపీలో పనిచేస్తున్నానని తెలిపారు. “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు.నా గురించి తెలంగాణ సమాజానికి తెలుసు…నేను పార్టీలు మారకూడదనే సందేశం ఇచ్చాను. అయినా కొందరు పోస్టర్లు వేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు,” అని విమర్శించారు.బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు తనను పార్టీ నుండి బర్తరఫ్ చేయడమే కాకుండా వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. తన “కోళ్ల ఫార్మ్‌లు కూల్చారు…లీగల్ గా కొనుక్కున్న తన భూములను గుంజుకున్నారని ఆరోపించారు.
“ఈటలను బయటకు పంపించడం కేసీఆర్ చేసిన పెద్ద తప్పు” అనే చర్చ ప్రజల్లో జరుగుతోందని పేర్కొన్నారు.ఆనాడు
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ మంత్రిపదవి ఆఫర్ చేసినప్పటికీ, తెలంగాణ ఉద్యమం పట్ల ఉన్న కమిట్‌మెంట్‌తో వెళ్లలేదని తెలిపారు.మనందరి ఎజెండా కేసీఆర్ ను ఓడ గొట్టడమే కదా అని రాజగో పాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ వంటి నాయకులు కాంగ్రెస్‌లో కి పోదాం అన్నారు.అలా పోయి ఉంటే ఈ రోజు మంత్రి నో, డిప్యుటీ సీఎం నో అయ్యే వాడిని… అలా నేను పదవుల కోసం పాకులాడే నాయకున్ని కాదని, నా గురించి చిల్లర మాటలు మాట్లాడొద్దని ఈ సందర్బంగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపైనా ఈటల తీవ్ర విమర్శలు గుప్పించారు.
“అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు.మీడియాను మేనేజ్ చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం లో దోచుకున్నది అంతా కక్కిస్తానని అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టనున్నామని, మొదటి కార్యక్రమంగా “చలో బాలాజీ నగర్”ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగే ఎన్నికల కోసం సర్వేలు నిర్వహిస్తున్నామని, గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. “గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తాం, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఉండదు,” అన్నారు.తన పార్లమెంట్ పరిధిపై పూర్తి అవగాహన తనకే ఉందని పేర్కొన్నారు.
సీఎస్‌ఆర్ నిధులు, స్థానిక సమస్యలపై ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాదికి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
హుజూరాబాద్ ప్రాంత సమస్యలపై ప్రజలు పిలిస్తే తాను ముందుండి పోరాటం చేస్తానన్నారు.ప్రజల్ని, ధర్మాన్ని నమ్ముకున్నాను. సోషల్ మీడియా ప్రచారాలను నమ్మను. సరైన సమయం వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ ఏంటో తెలుస్తుంది,” అని ఆయన అన్నారు.