- నాలుగు రోజుల తరవాత వెలుగులోకి ఘటన
లయోలా ప్రిన్సిపాల్ దినవన్ రావ్ పై పోక్సో కేసు నమోదు
కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
ఇబ్రహీంపట్నం,ముద్ర ప్రతినిధి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయాల్సిన ఆ ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో చదివే విద్యార్థినిపై కన్నేశాడు. తరచూ లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు నాలుగు రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేటలోని ఉన్న లయోలా మోడల్ హై స్కూల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి వివరాలు.. ఇబ్రహీంపట్నంలో లయోలా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దినావన్ రావ్ అదే పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని (16) పై లైంగికదాడి చేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన బాలిక తన తల్లితో విషయం చెప్పగా ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడైన దినావన్ రావు పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.
ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగు రోజులు గడుస్తున్న సమాచారం బయటకు రాకుండా పోలీసులు గొప్యంగా వ్యవహరించించినట్లు తెలుస్తోంది. గతంలోనూ విద్యార్థినిలను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా అతనిపై అనేక ఆరోపణలున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తాజా ఘటనలో తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పిఎస్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితమే మంగళ్ పల్లిలో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన మరువక ముందే మరో విద్యార్థినిపై లైంగిక దాడి చర్చనీయాంశం అయ్యింది.
కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. మున్సిపల్ కేంద్రంలోని దినావన్ రావు ఇంటిముందు, లయోలా మోడల్ హై స్కూల్ ఎదుట ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క సారిగా పాఠశాలలకు తోసుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు.. విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. చివరకు వారిని నాయకులను అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు.