- కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ.
- ఈ వారంలో ఇప్పటికే మూడుసార్లు
- కాళేశ్వరం కమిషన్ నోటీసులే ప్రధానాంశం.
- వెళ్లాలా. .వద్దా అనేది ఇంకా తేల్చని గులాబీ బాస్.
- మరో తేదీ కోసం కమిషన్ కు లేఖ రాయాలా అనేది దానిపైనా చర్చ.
- కవిత లేఖపైన కూడా చర్చ.
ముద్ర, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో బుధవారం మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్ నోటీసులు, విచారణ సంబంధిత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.కమిషన్ జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో విచారణకు వెళ్లాలా? వద్దా? అనే దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన తర్వాత హరీష్‌రావు కేసీఆర్‌ను మూడుసార్లు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.వచ్చే నెల 5న కేసీఆర్, 9న హరీశ్ రావు కమిషన్ ముందు వారు విచారణకు హాజరుకావాల్సి ఉంది. దీంతో విచారణ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? ఎటువంటి స్టాండ్ తీసుకోవాలనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచన జరిపినట్లు తెలిసింది.ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించిన కేసీఆర్, హరీశ్ రావు చట్టపరమైన అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం.అలాగే, గతంలో కమిషన్ ముందు హాజరైన అధికారులు, ఇంజినీర్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలుస్తోంది.ఇదిలా ఉండగా కమిషన్ ఎదుట హాజరై అభిప్రాయాలను చెబితే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా చర్చించిన ట్లుగా సమాచారం. విచారణకు హాజరవడం ద్వారా కమిషన్ సహా ప్రజలకు కూడా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంటుందన్న వాదన లేకపోలేదు. మంచి ఉద్దేశంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తి స్థాయిలో విడమర్చి చెప్పవచ్చన్న భావన కూడా కేసీఆర్ వ్యక్తమవుతోందని పార్టీ వర్గాల్లో వినిపిసల్తోంది. ఇదే అభిప్రాయాన్ని గతంలో కేసీఆర్ కొంతమంది నేతలతో వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు.అయితే కేసీఆర్ విచారణకు హజరవుతారా లేక గతంలో లాగా వివరణ ఇస్తూ లేఖ రాస్తారా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇప్పటి వరకు పార్టీ నేతలు, శ్రేణులకు అధినేత ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఒకటి, రెండు రోజుల్లో కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.అదే సమయంలో కవిత రాసిన లేఖ దాని పరిణామాలపై కూడా కేసీఆర్, హరీశ్ రావులు కొద్దిసేపు చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం లేఖపై ఎవరూ స్పందించ వద్దని కేసీఆర్ సూచించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఎండ్ పడుతుందని అప్పటి వరకు నేతలంతా సమయమం పాటించేలా చూడాలని హరీశ్ రావును ఆదేశించారని తెలుస్తోంది.