ముద్ర ప్రతినిధి, హైదరాబాద్:
తెలుగు సినీ పరిశ్రమకు దిక్సూచి లాంటి ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీ మాజీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, మాజీ కార్యదర్శి పి.ఎస్.ఎన్. దొరై, మాజీ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు పాల్గొని దాసరి నారాయణరావు గారి విగ్రహానికి పుష్పమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాసరి నారాయణరావు గారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అపార కృషి చేశారని, అనేక మందికి అవకాశాలు కల్పించి పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలిచారని కొనియాడారు. ఆయన చూపిన మార్గం సినీ రంగానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమం ముగింపులో ఆయన ఆలోచనలు, సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.