మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ ఏకపక్ష నిర్ణయం
జనగణనలో ఓబీసీ గణన చేసి దానికి అనుగుణంగా మహిళా కోటాలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పటం మహిళా లోకాన్ని మోసం చేయడమే అన్నారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం చేపట్టే జనగణనలో ఓబీసీ గణన చేయాలని డిమాండ్ చేశారు. జనగణన లో కులం కాలమ్ ఉన్నా వాళ్లు ఓబీసీలకు చెందుతారు అనే క్లాసిఫికేషన్ లేదన్నారు. దీంతో బీసీల జనాభా ఎంత అనే లెక్క తేలదన్నారు. జనగణన లో ఓబీసీలను లెక్కించి ఆ తర్వాతే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కోటా విషయంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బీసీ మహిళలంతా సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు.
డ్రాఫ్ట్ బిల్లు ముందే ఇవ్వాలి
మహిళ రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాలకు ముందే డ్రాప్ట్ బిల్లును అన్ని పార్టీలకు ఇవ్వాలని కవిత కోరారు. లేదంటే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదన్నారు. బిల్లుపై చర్చ జరిగే రోజు ఉదయమే సభ్యులకు బిల్లు పత్రులను ఇస్తామని చెప్పటమంటే కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్రనని మండిపడ్డారు. డ్రాఫ్ట్ బిల్లును ముందే ఇచ్చే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దేశంలోని జాతీయ పార్టీల నేతలతో మాట్లాడతానని కవిత చెప్పారు. పార్లమెంట్ లో మహిళ బిల్లు విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ మహిళలకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.