కొరత లేదంటూనే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్వాహకులు. -గ్రామాలలోనే వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చెయ్యాలి. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.
ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మండల పరిధిలోని గ్రామాలలోనే భారత్ గ్యాస్ సిలిండర్ డెలివరీ చెయ్యాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ గ్యాస్ కొరత లేదని నిబంధనల మేరకు గ్యాస్ బుక్కింగ్ చేసిన అందరికి అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ మండలంలోని గ్రామాలలో వారానికి ఒక్కసారి గ్యాస్ డెలివరీ బండి రావలసి ఉండగా దాదాపు రెండు మూడు వారాలుగా గ్రామాలలో గ్యాస్ డెలివరీ బండి రాకపోడంతో గ్రామాలలోని చాలామంది మోత్కూర్ కార్యాలయం ముందు గ్యాస్ కోసం క్యూ కడుతున్నారని గ్రామాలలోని వృద్దులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు సతమత మౌతున్న సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ పై 60 రూ లు పెంచి నట్టింట మంట పెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయల కు ఒక్క సిలిండర్ అమలు చేస్తామని ప్రకటించిందని పథకం లక్ష్యం గొప్పదైనప్పటికీ అమలులో ప్రభుత్వం నిరుగార్చిందని అన్నారు.కొరత లేదంటూనే ప్రజలను ఇబ్బందులకు గురించేయడం సరికాదని గృహ అవసరాల కోసం బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా గ్రామాలలోనే గ్యాస్ సిలిండర్లు డెలివరీ చెయ్యాలని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను కోరారు.