Take a fresh look at your lifestyle.

అల్ఫోర్స్‌లో ఘనంగా రెండో రోజు సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం

కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సుందరకాండ ప్రవచన జ్ఞానయజ్ఞం రెండో రోజు కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డితో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ సత్తు మల్లేశం మాట్లాడుతూ, ఇతిహాసాలలో సుందరకాండకు ప్రత్యేకమైన స్థానం ఉందని, ఇది మానసిక మరియు శారీరక శక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. నేటి పోటీ ప్రపంచంలో భగవంతుని ఆరాధన తగ్గిపోతున్నప్పటికీ, ప్రతి ఒక్కరూ భగవంతునితో సాంగత్యాన్ని పెంపొందించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. తల్లిదండ్రుల మాటను పాటిస్తూ, సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచిన శ్రీరాముని వైభవాన్ని తెలుసుకోవడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.

విద్యార్థుల్లో మేధాశక్తితో పాటు ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అల్ఫోర్స్ విద్యాసంస్థలు విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు వేదికగా నిలుస్తున్నాయని కొనియాడారు.

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రామాయణంలోని విశిష్టతను యువతకు తెలియజేయడం, భారతీయ ఇతిహాసాల పట్ల ఆసక్తిని పెంచడం లక్ష్యంగా ఈ జ్ఞానయజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమంతుడు సీతమ్మను కనుగొన్న ఘట్టం ద్వారా ఆయన బలం, భక్తి, ప్రేమ, గురుభక్తి వంటి విలువలను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నిర్వహించిన భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఉప్పల ఆంజనేయ ప్రసాద్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం భక్తులకు అల్పాహార ప్రసాదం అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.