వెలమలపై విషం కక్కిన సీఎం
ముఖ్యమంత్రిగా ఉండి తన మర్యాదలను అతిక్రమిస్తున్నారు
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే ఇదంతా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. వెలమజాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. గురువారం జూబ్లీహీల్స్ లోని జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధ భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. సీఎం తప్పకుండా ఇలాంటి వైఖరిని మార్చుకోవాలన్నారు.
సంజయ్ కాంగ్రెస్ లో చేరిక ముమ్మాటికి నిజం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‍లోకి చేరిన విషయం ముమ్మాటికీ నిజమని కవిత అన్నారు. సీఎం ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్‍లో చేరారన్న ఆమె ఆ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత సంజయ్… గాంధీభవన్‍లో అధికారిక సమావేశాలకు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ భీ ఫామ్‍లు కూడా ఇచ్చారని చెప్పారు. అలాంటి వ్యక్తికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వటం సరికాదన్నారు. సంజయ్ కి నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కటం, భవిష్యత్ తరాలకు మంచిది కాదన్నారు. వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
న్యాయవాదులకే రక్షణ లేదు…
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను పరామర్శించిన కవిత.. వారిని ఓదార్చి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాయర్ స్వప్న ఉదంతం బాధ కలిగించిందన్నారు. తనకు ప్రాణహాని ఉందని స్వప్న ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదన్నారు. దీనిపై పోలీసులు, ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. హైదరాబాద్ కు కూత వేటు దూరంలోనే ఈ సంఘటన జరగడం పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దం పడుతుందన్నారు. గతంలో న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ పొటెక్షన్ యాక్ట్ బిల్లుకు గతంలో సవరణలు చేశారని చెప్పారు. కానీ రెండేళ్లుగా ఆ బిల్లును పెండింగ్ లో పెట్టారన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి… ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలన్నారు. మూడు నెలలలోపు నిందితులకు శిక్ష పడే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నేరస్తులకు పోలీసులంటే భయం లేని పరిస్థితి నెలకొందని కవిత చెప్పారు. గన్ తో బెదిరించి డబ్బులు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి. పోలీసులకు సీరియస్ గా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. గతేడాది హైదరాబాద్ లో జరిగిన అగ్నిప్రమాదాల్లో 22 మంది చనిపోయారని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్కరి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. మున్సిపల్, హోం, విద్య శాఖ ఇలా చాలా శాఖలు సీఎం వద్దే ఉండటంతో ఆయన ఆయా శాఖల పురోగతిపై దృఫ్టిసారిచలేకపోతున్నారని చెప్పారు.