Take a fresh look at your lifestyle.

చెంచుల జీవనోపాధి అభివృద్ధికి టీజీఐఎల్పీ కీలకం : జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆదివాసి గిరిజన అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఇన్‌క్లూజివ్ లైవ్లీహుడ్స్ ప్రోగ్రామ్ (టీజీఐఎల్పీ)ను సమర్థవంతంగా అమలు చేసి చెంచు గిరిజన కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ పెంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, అత్యంత పేదరిక పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు గుర్తించిన 34 చెంచు కుటుంబాలతో సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కుటుంబాల జీవన విధానం, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య పరిస్థితులు, పిల్లల విద్య, తాగునీటి సౌకర్యాలు వంటి అంశాలపై సమగ్రంగా ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తరతరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న చెంచు కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

టీజీఐఎల్పీ కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించి, వారిని స్వయం ఆదాయం పొందే స్థాయికి చేర్చాలని సూచించారు. అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునే కుటుంబాలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి కుటుంబానికి వారి సామర్థ్యాలు, ఆసక్తులను ఆధారంగా చేసుకుని ప్రత్యేక జీవనోపాధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పశుపోషణ, కోళ్ల పెంపకం, చిన్నచిన్న వ్యాపారాలు, అటవీ ఉత్పత్తుల ఆధారిత ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇచ్చి ఆదాయ వనరులు పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

చెంచు మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఈ నెల 20వ తేదీన మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. అప్పటివరకు వారికి అనువైన స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలని అధికారులను కోరారు.

మహిళా సంఘాల ద్వారా పొదుపు అలవాట్లు పెంపొందించి, బ్యాంకు లింకేజీలు కల్పించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించాలని సూచించారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మల్లాపూర్ పెంటలో మౌలిక వసతుల కొరతపై గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, తాగునీరు, విద్యుత్, రహదారులు, ఆరోగ్య సేవలు, విద్యా సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పిల్లలు చదువుకు దూరం కాకుండా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన చెంచు కుటుంబాలకు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని తెలిపారు. పింఛన్లు, రేషన్, ఆరోగ్య భద్రత పథకాలు, గృహ నిర్మాణ పథకాలు వంటి ప్రయోజనాలు అందకుండా ఎవరూ మిగలకూడదని స్పష్టం చేశారు.

చెంచు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని, గ్రామ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం సాయం అందించడం మాత్రమే కాకుండా, ప్రతి కుటుంబం గౌరవప్రదమైన జీవితం గడపగలిగే స్థాయికి తీసుకెళ్లడమేనని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ చిన్న ఓబులేష్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.