- త్వరితగతిన పనులు పూర్తి చేయండి
- అధికారులకు కలెక్టర్ హనుమంతరావు ఆదేశం
బీబీనగర్, ముద్ర విలేకరి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో కొత్తగా చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంత రావు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణంలోని భవనంలో ఇంకా ఏం పనులు పెండింగ్ లో వున్నాయన్నది స్వయంగా పర్యవేక్షించారు. భవనం ముందరి స్థలాన్ని చదును చేయడంతో పాటు కొత్తగా ఒక గేట్ ను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో వున్న పనులన్నింటినీ తొందరగా పూర్తి చేసి వారం రోజుల్లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టరు ను ఆదేశించారు.
అనంతరం బీబీనగర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి డాక్టర్, సిబ్బంది ఎంత మంది విధులకు హాజరు అయ్యారా అన్నది పరిశీలించారు. ఈరోజు ఓపికి ఎంత మంది పేషెంట్లు వచ్చారని అని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెల లో ఎన్ని నార్మల్ డెలివరీ అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో నార్మల్ డెలివరీ ల సంఖ్య పెరగాలని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం కలిగేలా వైద్యం చేయాలన్నారు. మందుల స్టాక్ ను పరిశీలించారు. అన్ని మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తర్వాత బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు జరుగుతున్నాయ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన నిర్మాణ

పనులుకు డబ్బులు పడ్డాయా లేదా, ఏమి అయినా పెండింగ్ ఉన్నాయా అని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు అయిన లక్ష్మమ్మ నిర్మిస్తున్న ఇంటి పనులు కలెక్టర్ పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి మేస్త్రీ ఎంత డబ్బులు తీసుకుంటున్నాడని ప్రశ్నించారు. చదరపు అడుగుకు 300 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వవద్దని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇటుక, సిమెంట్ తక్కువ ధరకే ఇవ్వాలని ఎంపీడీఓ, ఎం ఆర్ ఓ లు షాప్ యజమానులతో మాట్లాడి ధర నిర్ణయించాలని అని చెప్పారు. ఇంటి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని లక్ష్మమ్మ కి సూచించారు. డబ్బులు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ప్రతి సోమవారం లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బులు జమ అవుతున్నాయి అని అన్నారు.
ఈ పర్యటనలో భాగంగా కలెక్టర్ ఎం.హనుమంత రావు రుద్రవెల్లి గ్రామములోని మూసి వాగుని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిశీలించారు. ఆయనతో పాటు ఎంపీడీవో వై.శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, పంచాయత్ సెక్రటరీ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మండలంలోని వివిధ శాఖల అధికారులు ఉన్నారు.