ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో నిర్మాణంలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల నిర్మాణ పనులను ఆలస్యం లేకుండా వేగంగా కొనసాగించి, వచ్చే విద్యా సంవత్సరం జూన్ నాటికి అకాడమిక్ కార్యక్రమాలు ప్రారంభమయ్యేలా అన్ని పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో పనులు నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పాఠశాలలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అందువల్ల పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు.
పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక తరగతి గదులతో పాటు విశాలమైన డార్మిటరీలు, సరైన గాలి, వెలుతురు సదుపాయాలు కల్పించాలని సూచించారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎంట్రన్స్ గ్రౌండ్, క్రికెట్ మైదానం, ఇతర క్రీడా స్థలాలు, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య వసతులు వంటి అంశాలను నాణ్యతతో నిర్మించాలన్నారు.
పనులు వేగంగా పూర్తి చేయడమే కాకుండా, నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయిన అనంతరం ఆధునిక సదుపాయాలతో కూడిన విద్యా వాతావరణం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి, జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.