Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

 

ముద్ర సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లా, హత్నూర మండల పరిధిలోని మంగపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.


మండలంలోని ప్రతి గ్రామంలో పూరి ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.గ్రామంలో మంజూరైన ఇండ్ల సంఖ్య, నిర్మాణ దశలు,లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ వంటి అంశాలపై పై ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు.నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఫోటో కాప్చరింగ్ వెంటనే పంపాలని సూచించారు.అలాగే స్లాబ్ పనులు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లకు ఏప్రిల్ 20-26 వరకు నిర్వహించే సంక్షేమ మహోత్సవాల సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తమ స్వంత ఇళ్లలో నివసించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నిర్మాణంలో వున్న ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు ఇవ్వాలని అధికారులను పేర్కొన్నారు.


వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.గ్రామాల్లో నీటి వనరులను పరిశీలించి అవసరమైన చోట్ల బోర్లు మరమ్మతులు చేయడం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు.
అనంతరం కాసాల గ్రామంలోని డీసీఎంఎస్ ఎఫ్‌ఎస్‌సీ ఫర్టిలైజర్స్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాలు,ఎరువులు, పురుగుమందుల నిల్వలను పరిశీలించారు.విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లుబుక్స్, స్టాక్ బోర్డు వివరాలను తనిఖీ చేసి అధికారులను పలు విషయాలపై ప్రశ్నించారు. రైతులకు అవసరమైన ఎరువులు,విత్తనాలు సరిపడా నిల్వలో ఉంచాలని,ధరల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని దుకాణ నిర్వాహకులకు సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువులు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈకార్యక్రమంలో హౌసింగ్ పిడి చలపతిరావు,సర్పంచ్ మన్నే రాధా రమేష్, తహసీల్దార్,ఎంపీడీఓ పంచాయితీ సెక్రటరీ,ఇంజినీరింగ్ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.