శిక్షణ పూర్తి చేసుకున్న మెదక్ జిల్లాకు చెందిన పోలీస్ జాగిలాలు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మొయినాబాద్‌లోని ఐఐటీఏలో శిక్షణను పూర్తి చేసుకొని నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో జాగిలాలు పాల్గొన్నాయి. రెండు విభాగాల్లో శిక్షణ పొందిన ఈ జాగిలాల్లో బీరప్పకు చెందిన ‘భైరవ్’ స్నేఫర్ విభాగంలో శిక్షణను పూర్తిచేయగా, రమేష్, గణేష్‌లకు చెందిన ‘బృనో’ ట్రాకర్ విభాగంలో 8 నెలల పాటు ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. గురువారం మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జాగిలాలను పరిశీలించేందుకు హాజరై, జాగిలాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ… పోలీస్ జాగిలాలు నేరాల చేదనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పేలుడు పదార్థాల గుర్తింపు, మాదకద్రవ్యాల స్వాధీనం, నిందితుల గాలింపు, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకోవడంలో జాగిలాల సేవలు అమూల్యమని అన్నారు. ఆధునిక కాలంలో నేరస్తులు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని, అలాంటి సందర్భాల్లో శిక్షణ పొందిన జాగిలాలు పోలీస్ విభాగానికి బలంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కఠినమైన శిక్షణతో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారైన భైరవ్, బృనో జాగిలాలు మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు మరింత సమర్థంగా సేవలందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జాగిలాలను నిర్వహించే సిబ్బంది మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్ఐ శైలేందర్, ఆర్ఎస్ఐ భవాని కుమార్ తదితరులు పాల్గొన్నారు.