Take a fresh look at your lifestyle.

గరుడ ఆళ్లవార్ కి నవ కలశ పంచామృత అభిషేకం

  • అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవం.

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయణం శ్రావణము శుక్ల పక్షము వర్ష ఋతువు మంగళవారం పంచమి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించారు.సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనం, నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు. అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు సుగంధ భరితమైన పుష్పమాలలను మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య తీసుకోని వచ్చి శ్రీ స్వామి వారికి తోమాల సేవ నిర్వహించారు. స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రావణ మాసం సందర్బంగా శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్యార్చనలు పూర్తి అయిన తరువాత,నవ కలశ పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించారు. క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు అష్ట ఐశ్వర్య ప్రాప్తి కోసం మహాలక్ష్మి హావనం నిర్వహించారు. గరుడ పంచమి పురస్కరించుకొని గరుడ ఆళ్లవార్ కి అర్చక స్వాములు నవ కలశ పంచామృత అభిషేకాన్ని వైభవపేతంగా నిర్వహించారు. అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు నయనానందకరంగా శ్రీవారినీ దర్శించుకున్నారు.సాయంత్రం శ్రావణమాసం పురస్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారి కి సహస్ర కుంకుమార్చన సేవ అర్చక స్వాములు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.