Take a fresh look at your lifestyle.

​అప్పుల బాధతో స్టాఫ్ నర్స్ ఆత్మహత్య

ముద్ర కూకట్‌పల్లి :

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లాకు చెందిన కామిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (37), గత ఐదేళ్లుగా కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో నివసిస్తున్నాడు. ఇతను నెక్స్‌జెన్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తూ తన భార్య, తల్లి మరియు కుమార్తెతో కలిసి ఉంటున్నాడు.
​గురువారం (మార్చి 05) రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో వెంకటేశ్వర్ రెడ్డి మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. తనకు అప్పులు ఎక్కువయ్యాయని, తనకున్న భూమి అమ్మి ఆ అప్పులు తీర్చుకుంటానని ఇంట్లో వారితో గట్టిగా అరిచి చెప్పాడు. అనంతరం తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ సమయంలో భార్య, కూతురు పక్క గదిలో, తల్లి హాల్‌లో నిద్రపోయారు.
శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో తల్లి, భార్య కలిసి ఎంత పిలిచినా లోపలి నుండి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే వెంకటేశ్వర్ రెడ్డి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు.
​మృతుడి తల్లి భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అప్పుల బాధతో లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.