ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండడం వల్ల ఈద్గాం చౌరస్తా వద్ద ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని నిర్మల్ ఎ ఎస్పీ సాయి కిరణ్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రోడ్లను డైవర్షన్ చేస్తున్నామని, ప్రజలు ఈ మార్పు గమనించాలని కోరారు. మంచిర్యాల చౌరస్తా నుండి భాగ్యనగర్, ప్రియదర్శిని నగర్ వైపు వెళ్లే వాహనదారులు ఈద్గాం చౌరస్తా ద్వారా వెళ్లకుండా, సుమారు 100 మీటర్ల ముందుకు వెళ్లి యూ-టర్న్ తీసుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. భైంసా, భాగ్యనగర్, ప్రియదర్శిని నగర్ నుండి వచ్చే వాహనదారులు ఈద్గాం చౌరస్తా వద్దకు రాకుండా, గోల్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో యూ-టర్న్ తీసుకొని ఆదర్శనగర్, సిద్దాపూర్ వైపు ప్రయాణించవలసిందిగా సూచించారు. ఈ చర్య తాత్కాలికంగా ఇబ్బంది కలిగినా నిర్మల్ ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడుతుందన్నారు.