చంద్రబాబు కోసం పాదయాత్ర..
ముద్ర, అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం అమరావతిలోని అసెంబ్లీ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తిరుమలకు చేపట్టిన తన పాదయాత్ర పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.
2023లో వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన సమయంలో, ఆయన త్వరలోనే విడుదలై మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని కోరుకుంటూ బండ్ల గణేష్ ఒక మొక్కు పెట్టుకున్నారు. చంద్రబాబు సీఎం అయితే తిరుమలకు పాదయాత్రగా వెళ్లి దర్శనం చేసుకుంటానని ఆయన సంకల్పించారు.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన మొక్కును నెరవేర్చేందుకు బండ్ల గణేష్ “సంకల్ప యాత్ర” పేరుతో జనవరి 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మొత్తం 23 రోజుల పాటు 535 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర ఫిబ్రవరి 10న తిరుమలకు చేరుకుంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న అనంతరం, అమరావతికి చేరుకున్న బండ్ల గణేష్ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనను ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు.
పాదయాత్ర అనుభవాలను సీఎంతో పంచుకున్న బండ్ల గణేష్, దారి పొడవునా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తనకు అండగా నిలిచారని తెలిపారు. వారి ప్రోత్సాహమే తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, అదే శక్తితో తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నానని చెప్పారు.
ఈ భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.