- అంతకు ముందు మేలో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ
- రెండేళ్లలో విస్తరణ పనులు పూర్తి
- బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి
- త్వరలో రాష్ట్రంలో అన్ని పార్టీలు కనుమరుగు
- రాష్ట్ర ఆర్అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా సముద్రపు ఓడరేవుకు కనెక్టివిటీని అందించడానికి ఉద్దేశించబడిన డ్రై పోర్టును నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అంతకు ముందు ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. పనుల్లో జాప్యం జరగకుండా రెండేళ్లలోపే వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది తనకల అని ఆయన వ్యాఖ్యానించారు.సోమవారం నల్గొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విస్తరణ పనుల తర్వాత అది ప్రమాదరహిత జాతీయ రహదారిగా అందుబాటులోకి వస్తుందన్నారు.వాహనాల రద్దీ విషయంలో ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చెప్పిన జీఎంఆర్..నేషనల్ హైవే అథారిటీతో చేసుకున్న అగ్రిమెంట్ ను ఉల్లంఘించిందన్నారు. తన పోరాటంతోనే 65 వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ జరగబోతుందన్నారు. అర్వపల్లి జంక్షన్ లో ఫ్లైఓవర్ లేదనీ అందుకు ప్రజలు ఆందోళనకు గురికావద్దని చెప్పారు. మే నెలలో ట్రిపుల్ ఆర్ పనులు మొదలవుతాయని చెప్పారు. ఈ పనుల విషయంలో గత సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు హైదరాబాద్ రూపు రేఖలు మారిపోతాయని చెప్పారు.
త్రిబుల్ ఆర్ పూర్తి చేసేందుకు తాను, సీఎం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కేటీఆర్ ధర్నాలు దీక్షలు, పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మరన్న కోమటిరెడ్డి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రైతు ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు.బీఆర్ఎస్ చేసిన మోసంతోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 50 వేలకు పైగా మెజారిటీ, ఎంపీలు దేశంలోనే రికార్డు మెజారిటీతో గెలిచారని చెప్పారు. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను వందేళ్లు వెనక్కి నెట్టిందన్నారు. త్వరలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. తర్వాత రాష్ట్రంలో అన్ని పార్టీలు కనుమరుగవుతాయి వ్యాఖ్యానించారు.