ప్రభుత్వ విధానాలు, సంకల్పంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి
ట్రైడెంట్ ఏఐ కంపెనీతో రూ.300 కోట్ల ఒప్పందం
రూ.వెయ్యి కోట్లు పెట్టేందుకు ముందుకువచ్చిన ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్
మీడియాతో ఐటీ. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రజా ప్రభుత్వ పాలనలో అభివృద్ధిలో దూసుకువెళ్తున్న తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. అయినా ప్రభుత్వ విధానాలు, సంకల్పంతో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయని చెప్పారు. తాజాగా యూఎస్‍కు చెందిన ట్రైడెంట్ ఏఐ కంపెనీ రూ.300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుందన్న మంత్రి… ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్ రూ.వెయ్యి కోట్లు, ఫ్రాజెన్స్ కు చెందిన గ్లోబల్ హెల్త్ కేర్ కంపనీ ఒపెల్లా వంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇది రాష్ట్రానికి శుభ సూచకం అన్నారు. ఈ పెట్టుబడులతో స్థానికంగా ఉపాధి అవకాశాలను పెరుగుతాయన్నారు. మంగళవారం హైటెక్స్ లో బయో ఆసియా సదస్సు-2026 ప్రారంభం అనంతరం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. బయో ఆసియా 2026 సదస్సులో పారిశ్రామిక వేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహం పాల్గొన్నారని చెప్పారు. టెక్నాలజీతో భౌగోళిక, ఆర్థిక, రాజకీయ మార్పుకు అనుగుణంగా సదస్సు విజన్ పెట్టుకున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలు.. ఏఐ టెక్నాలజీ వినియోగించుకుని ముందుకు వెళ్లాలన్నారు. హెల్త్ కేర్.. ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 25 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్ అని చెప్పారు. త్వరలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఐదు లక్షల ఉద్యోగాలు టార్గెట్..
హైదరాబాద్‍ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‍గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మార్పులకు అనుగుణంగా.. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో మెరుగైన టెక్నాలజీని ఉపయోగించుకుంటామని వెల్లడించారు. జినోమ్ వ్యాలీ ఫేజ్ 4 ను వంద ఎకరాలతో విస్తరించ బోతున్నట్లు వివరించారు. అత్యాధునిక మౌలిక వసతులతో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 4 ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 2035 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగంలో ఆకర్షించేందుకు ప్రణాళిక పెట్టుకున్నామన్నారు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించే లక్ష్యంతో ఉన్నామని తెలంగాణను ప్రపంచంలోని టాప్–3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలుపుతామన్నారు. ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి ఆధునిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణతో పాటు తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా రెడీ టు వర్క్ ఫోర్స్ సిద్ధం చేస్తామన్నారు. ఉత్పత్తి మాత్రమే కాకుండా కొత్త ఔషధాల పరిశోధన కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు.