Take a fresh look at your lifestyle.

జీవవైజ్ఞానిక రాజధాని కోసం భాగస్వాములుకండి-3వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సు లో సీఎం

 

హైదరాబాద్ ను సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం

ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ

ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా భాగ్యనగరం 3వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సు లో సీఎం

ముద్ర, తెలంగాణ బ్యూరో : వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదగడంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ దిగ్గజ కంపెనీలు, శాస్త్రవేత్తలు, నిపుణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ… దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతోందన్న ఆయన ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని వెల్లడించారు. అలాంటి హైదరాబాద్‌ను అందరం కలిసి సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదామని విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్స్‌లో 23వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచస్థాయి సదస్సులో మాట్లాడిన సీఎం.. తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. “ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవవైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతుంది. అందుకు తెలంగాణ ఉంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. జీవవైజ్ఞానిక రంగంలో ప్రస్తుతం వస్తున్న ఆధునిక మార్పులను గమనిస్తే, పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం ఉంది. ఆయా సంస్థలు, కార్పొరేట్లు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఆ వాతావరణాన్ని తెలంగాణ అందిస్తుందన్నారు. అందుకు హైదరాబాద్ అనుకూలమైందని చెప్పారు. బల్క్‌డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుండి ఆవిష్కరణ వరకు, భారతదేశం నుండి ప్రపంచస్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందని వివరించారు. తెలంగాణలో ఉన్న వనరులు, అనుకూల పరిస్థితుల దృష్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కోరారు. జీసీసీలను స్థాపింపి.. ఆవిష్కరణ కేంద్రాలు నిర్మించాలన్నారు. మాలిక్యూల్స్ , ఔషధాలను డిజైన్, క్లినికల్ అనలిటిక్స్‌ను ప్రారంభించామన్నారు. ఏఐ ప్లాట్‌ఫామ్‌లను, డిజిటల్ తయారీ రంగాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అందుకు ప్రభుత్వం, యంత్రాంగం, శాస్త్రవేత్తలు, నైపుణ్యంతో కూడిన యువత మీ విజయంలో భాగస్వాములుగా ఉంటారని సీఎం హామీ ఇచ్చారు. 23 ఏళ్ల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్ వేర్ నగరంగా గుర్తింపు ఉండేదని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా కూడా నిలిచిందని హర్షించారు. దూరదృష్టి కలిగిన నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఉండటంతో హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్ రంగాల్లో ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని చెప్పారు. జీవవిజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు గడిచిన రెండేళ్లలో తెలంగాణలో జీవవిజ్ఞాన రంగంలో రూ. 73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని సీఎం తెలిపారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా తెలంగాణ నూతన లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామన్న ఆయన. జినోమ్ వ్యాలీని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణల కోసం వన్-బయోను ప్రారంభించామన్నారు. ఇటీవలే “తెలంగాణ రైజింగ్ 2047” విజన్‌ను ఆవిష్కరించామనీ 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నది మా లక్ష్యమన్నారు. గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి వేగవంతం తెలంగాణలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేసినట్లు సీఎం వెల్లడించారు. అందులో భాగంగా బలమైన సంకల్పంతో ఇప్పటికే అనేక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఆహ్వానించినట్లు చెప్పారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే బయోఏషియా-2026 సదస్సు అని సీఎం వివరించారు. ఇప్పుడు బయోఏషియా తన పరిధిని విస్తరించుకుని “బయోవరల్డ్‌”గా మారుతోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలు, దాదాపు 4 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకావడం అభినందనీయమన్నారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, హెల్త్‌కేర్ రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ సదస్సులో పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్ లో లో జరుగుతున్న ఈ బయో ఏషియా సదస్సు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న విశ్వాసం తనకుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి బయోఏషియా సదస్సుకు హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్ కు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు-2026 అందించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.