ముద్ర, తాండూర్ :
వంట గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్డుకు అడ్డంగా ఖాళీ సిలిండర్లతో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన వినియోగదారులు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పక్కనే ఉన్న అంబా భవాని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్యాస్ బుకింగ్ చేసుకున్నా వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీ దగ్గర ఒక్కసారిగా గుమి కూడరు.దీంతో ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ కొరతగా ఉందని సిలిండర్లు రాగానే అందరికీ సరఫరా చేస్తామన్నారు. దీంతో ఆగ్రహించిన వినియోగదారులు ఇంకెన్నాళ్లు గ్యాస్ కోసం ఎదురు చూడాలని కోపోద్రిక్తులై పక్కనే ఉన్న తాండూర్ రైల్వే బ్రిడ్జి పైన రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో రోడ్డుపైన అటు ఇటు రాకపోకలు స్తంభించిపోయాయి. దారి పొడవునా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దాదాపుగా అరగంటకు పైగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పట్టణ సిఐ సంతోష్ కుమార్ సంఘటన స్థలానికి సిబ్బందితో కలిసి వెళ్లి ధర్నాకు దిగిన వినియోగదారులకు సర్ది చెప్పి రోడ్డుకు అడ్డంగా ఉంచిన సిలిండర్లను తొలగింప చేసి వాహనాలు ప్రయాణించేందుకు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.