ముద్ర, న్యూస్ బ్యూరో ,హైదరాబాద్: మౌలాలిలోని శ్రీరంగగిరి సన్నిధిలో శుక్రవారం నాడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.ప్రఖ్యాత సంగీత విదుషీమణి శ్రీమతి డా. వై. రమాప్రభగారి ఆధ్వర్యంలో వారి ‘సమ్మోహన స్కూల్ ఫర్ ఓకల్ మ్యూజిక్’ విద్యార్థులు, మరెందరో సంగీతాభిమానులైన రసఙ్ఞులు అందరి గళాలొక్కటై “శ్రీరంగనాథ పంచకం” ను ఎంతో ఆర్ద్రంగా, శ్రావ్యంగా, స్వరలయాన్వితంగా, మంద్రమధురంగా ఆలపించారు.

గరుడగమనతో పాటు మరికొన్ని సంప్రదాయ రంగనాథ కీర్తనలు, గోవిందనామాల సామూహిక గానం తిరుప్పావై మహోత్సవంలో ఒక అద్భుత ఘట్టం.వందల మంది గోదాస్వరూపులైన మహిళా మూర్తులు అమ్మవారి పల్లకీని మోస్తూ తన్మయులయ్యారు…శుక్రవారంనాడు కుత్తువిళక్కెరియ విశేష పాశురం… రంగమంటపాన్ని దీపాలంకృతం చేసే కమనీయ ఘట్టం.

శ్రీరంగగిరిని అసంఖ్యాక భక్తులు దీపాలతో అలంకరించడంతో కోవెల కొత్త రూపు సంతరించుకుంది…
ఇవాల్టి పాశురం కుత్తువిళక్కెరియ తో పాటు, దానికి దేవులపల్లివారు తెలుగులో కూర్చిన అక్షర మాలికను కూడా శ్రీమతి డా. వై.రమాప్రభ రాగయుక్తంగా ఆలపించి మంత్రముగ్ధుల్ని చేశారు. అంతేగాక పాశురార్థ మాధుర్యాన్ని కూడా పంచడం విశేషం.కుత్తువిళక్కెరియ దీపోత్సవం, స్వామికి జరిగిన సామూహిక గళార్చన, అసంఖ్యాక మహిళా మూర్తుల సద్గోష్ఠి… ఇవన్నీ మనసుపై చెరగని ముద్ర వేశాయి.

