– మీరు వేలం వేసి కోట్లు సంపాదిస్తూ, మా భూములకు మాత్రం తక్కువ సహాయం అందిస్తారా
– ఎఫ్ టి ఎల్ పై అవగాహన లేని అధికారులు
ముద్ర, బండ్లగూడ:
మూసి ప్రాజెక్టు తమ ఆధ్వర్యంలో చేసాము అని చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ప్రాజెక్టు అని, దీనికోసం బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని రాజేంద్రనగర్ బి.ఆర్.ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మండిపడ్డారు. గాంధీ సరోవర్, మూసి అభివృద్ధి లో భాగంగా భూములు కోల్పోతున్న వారితో అధికారులు గురువారం హైదర్ గుడా, కిస్మత్ పూర్ లలో సమావేశాలు నిర్వహించారు. చట్టపరంగా భూసేకరణ చేస్తున్నామని, భూములు, ఇండ్లు కోల్పోతున్న వారికి పలు రకాలుగా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని సూచించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.
అధికారులు రాజకీయ కోణాల్లో మాట్లాడొద్దు…..
అధికారులు నిర్వహిస్తున్న సమావేశానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి విచ్చేసి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2013 ఆక్ట్ ప్రకారం ప్రజలకు అవసరం వచ్చే పనుల నిమిత్తం భూమిని సేకరించాలని అన్నారు. హైదరాబాద్ నగరానికి ట్యాంక్ బండ్ ఎలాగో ఈ మూసి కూడా అదే విధంగా ప్రజలకు పనికిరాని ప్రాజెక్ట్ అవుతుంది అన్నారు. ఎఫ్ టి ఎల్ అనేది చెరువులకు ఉంటది కాని నదులకు ఉండదు అని ఇంగిత జ్ఞానం కూడా అధికారులకు లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. ముసి నదికి సరైన రివర్ బెడ్, హద్దులు నేటి వరకు కూడా లేవని గుర్తు చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న భూములను, కష్టపడి బ్యాంకుల్లో అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లను లాక్కోవడానికి మీకు ఎలాంటి హక్కు లేదని అన్నారు. మీరు భూములను వేలం వేసి ఉన్న ధరలకంటే అధిక రెట్లలో అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నారు. మా భూములు లాక్కొని మాత్రం ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉన్న ధరల డబ్బులు చెల్లిస్తామంటే ఇదెక్కడి న్యాయం అని మండిపడ్డారు. అయినా ఈ ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు సేకరిస్తున్న ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక్కోలా పరిహారం చెల్లిస్తామని అనడం ఎంతవరకు న్యాయం అన్నారు. భూమికి భూమి ఇవ్వాలని తమ ప్రాంత ప్రజలు అడుగుతుంటే కొందరికి డిడిఆర్ ఇస్తామని, కొందరికి 20 శాతం స్థలం ఇస్తామని చెప్పడమేమిటని మండిపడ్డారు. కేవలం తమ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట్ రెడ్డి, డీఎంసీ సురేందర్ రెడ్డి, నాయకులు నాగరాజు, రవీందర్ రెడ్డి, ప్రేమ్ గౌడ్ తదితరులు ఉన్నారు.