ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
శుక్రవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 44 మంది దివ్యాంగులకు వాహనాలను పంపిణీ చేశారు. అదేవిధంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్‌ఫోన్లు అందజేశారు. అలాగే 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్‌చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపరచడం, స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ, దివ్యాంగులను వ్యక్తిగతంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, వారు సమాజంలో ఎవరికీ తీసిపోరని స్పష్టం చేశారు. దివ్యాంగులకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
అలాగే దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, వారిని స్వయం సమృద్ధి సాధించేలా మరిన్ని వినూత్న పథకాలు ప్రవేశపెడతామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, ఇతర సాయాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.