Take a fresh look at your lifestyle.

పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది: జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బద్రీ నాయక్ ఇటీవల ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆయనకు అభినందనలు తెలిపారు.


ఎస్పీ తన చేతుల మీదుగా బద్రీ నాయక్‌కు ఏఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్స్ అలంకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం ఉన్నత స్థానానికి ఎదగడం మాత్రమే కాకుండా బాధ్యతలను మరింత పెంచుతుందని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన ప్రతి పోలీస్ సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడి సమస్యను సానుభూతితో వినడం, వారికి తక్షణ సహాయం అందించడం, న్యాయం జరిగేలా కృషి చేయడం పోలీస్ సిబ్బంది ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, నిరుపేదలు వంటి బలహీన వర్గాలకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు.
పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం వంటి విలువలను పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే మరిన్ని అవకాశాలు, గుర్తింపు లభిస్తాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.