- PSU (ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్).
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్(పి.ఎస్.యూ) సూర్యాపేట కార్యాలయంలో ప్రెస్ మీట్ ఆదివారం నిర్వహించడం జరిగింది. పి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యలకు నిలయాలుగా మారాయనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా బ్రాండ్ పేరుతో ఆర్భాటం చేస్తూ మరొకవైపు ప్రభుత్వ పాఠశాలలను,యూనివర్సిటీలను,కాలేజిలను,రెసిడెన్షియల్ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ విద్యా సంస్థలు,హాస్టళ్లలో మౌళిక సదుపాయాల కల్పన, మరమ్మత్తులు చేయలేదనీ,యూనివర్శిటీలలో ప్రొఫెసర్ల భర్తీ చేయలేదనీ, పాఠశాలలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల భర్తీ చేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను గురుకులాను,సంక్షేమ హాస్టళ్లను మూసివేస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలావస్థలో వున్న సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు పక్కా బిల్డింగులు నిర్మించడం లేదనీ, మెజారిటీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయనీ, ప్రభుత్వం గత ఏడాదిగా కనీసం వాటి అద్దె కూడా చెల్లించలేదన్నారు. దీంతో బిల్డింగుల యాజమానులు హాస్టళ్లకు తాలాలు పెడుతున్నారనీ, పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు విడుదల చేయలేదనీ ఆరోపించారు. కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్ల కోసం వెళ్లిన విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయనీ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నవన్నారు. ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు, వసతులు పాటించకుండా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసి దోపిడీ పాల్పడుతున్నాయనీ, దోపిడి అడ్డుకోవడం కోసం మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఇచ్చిన హామీ మరిచారనీ గుర్తు చేశారు. జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలతో పాటు విద్యారంగ అభివృద్ధికి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు.
- డిమాండ్స్:
1)పాఠశాలలు,కళాశాలలు,యూనివర్సిటీలలో,హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
2) పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి.
3)సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు స్కిల్ యూనివర్సిటీలను తీసుకురావాలి, అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి.
4) సంక్షేమ హాస్టళ్లు గురుకులాలు పక్కా బిల్డింగులు నిర్మించాలి
అంతకు ముందు ప్రైవేటు బిల్డింగుల అద్దె చెల్లించాలి.
5)యూనివర్సిటీలలో ప్రొపెసర్ల నియామకాలు చేపట్టాలి.
6)ఫీజుల నియంత్రణ చట్టం రూపొందించాలి.రాష్ట్రంలోఇంజనీరింగ్ కోర్సు ఫీజుల పెంపును నిలిపివేయాలి.
ఈ కార్యక్రమంలో పి.ఎస్.యూ ఉమ్మడి జిల్లా నాయకులు ఎం వంశీ, ఎన్ అజయ్, జి శ్యామ్, మహేందర్, చందులు పాల్గొన్నారు.