- బంగారం షాపు వెనుకనుండి స్కెచ్ వేసిన దొంగలు.
- దొంగతనం జరిగిన షాపును సందర్శించి పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, డి.ఎస్.పి ప్రసన్నకుమార్, సిఐ వెంకటయ్య తదితరులు.
సూర్యాపేట, ముద్ర ప్రతినిధి:సూర్యాపేటలో ఆదివారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. భారీ స్కెచ్ వేసి సుమారు 18 కోట్ల రూపాయల విలువైన 18 కేజీల బంగారం అపహరించుకుపోయారు.సూర్యాపేట పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఉన్న సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఆదివారం రాత్రి భారీ బంగారం చోరీ జరిగింది. దుకాణదారుడు తేడ్ల కిషోర్ ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం షాపును మూసివేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం షాపు తలుపులు తెరిచినప్పుడు షట్టర్ పగులిపోయి ఉండటంతో వెంటనే దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.తీవ్ర ఆందోళనకు గురైన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, షాపు వెనుక భాగంలో ఉన్న బాలాజీ గ్రాండ్ ఎదురుగా గల రెండు బాత్రూమ్ల గోడలలో రంధ్రం చేసి, గ్యాస్ కట్టర్లతో షట్టర్లను కట్ చేసి దొంగలు లోపలికి ప్రవేశించారని తెలిపారు.ఇలాంటి తరహా దొంగతనం 2011లో కూడా ఇదే పట్టణంలో అప్పటిలాగే చోటుచేసుకుందనీ, చోరీప్లాన్ మళ్లీ కనపడుతోందని ఎస్పీ అన్నారు.సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ దొంగల ముఠాను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించినట్టు తెలిపారు. క్లూస్ టీమ్స్ వివరాలు సేకరించారు. బాధితుల అంచనా ప్రకారం దాదాపు 15 నుండి 18 కిలోల బంగారం చోరీకి గురైనట్లు తెలుస్తోంది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారు.
