Take a fresh look at your lifestyle.

ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా లేదా! చావమంటారా!

  • ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతన్నలు.
  • రాస్తారోకోలో నిలిచిపోయిన తాసిల్దార్.

ముద్ర/వీపనగండ్ల: మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఐకెపి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తూముకుంట సొసైటీ వారు కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని వీపనగండ్ల రైతులు మంగళవారం సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకులో చిక్కుకున్న వీపనగండ్ల తాసిల్దార్ వరలక్ష్మి తో రైతులు సమస్యలను మొరపెట్టుకున్నారు. ఆరుకాలం కష్టపడి పండించిన పంటను విక్రయించటానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించడానికి తరలించి రెండు నెలలు కావస్తున్న ఐకెపి సిబ్బంది నిర్లక్ష్యంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపించారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తేమశాతం మరింత కోల్పోయి నష్టపోవాల్సి వస్తుందని రైతుల ఆవేదన చెందుతున్నారు.గతంలో 40 కేజీల సంచికి ఒక కేజీ వడ్లు తరుగు తీస్తుండగా ఈమారు అందుకు విరుద్ధంగా రైస్ మిల్లర్లు వడ్లల్లో తాళ్లు ఎక్కువగా ఉందంటూ 40 కేజీల సంచికి మూడు నుంచి నాలుగు కేజీల వరకు తరుగుతీస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పండించిన దానాన్ని విక్రయించటానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన కొనుగోలు చేయటం లేదని. కొందరి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే నిలువ ఉంచుతున్నారని వాపోయారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లకు, గోదాములకు తరలిస్తే రైతులకు కూడా ఇబ్బందులు తప్పుతాయని, రైతులు పండించిన ధాన్యంలో ఇప్పటివరకు 20% కూడా కొనుగోలు చేయలేదని రైతులు వాపోయారు. గతంలో ఐకెపి కొనుగోలు కేంద్రంతోపాటు తూముకుంట సొసైటీ వారు కూడా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరిగేదని, ప్రస్తుతం ఐకెపి కొనుగోలు మాత్రమే ఉండటంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ధాన్యానికి సరిపడా గన్ని బ్యాగులు కూడా రావటం లేదని రైతుల ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలను వేగవంతం చేయాలని తాసిల్దార్ కు వివరించారు.ఇప్పటికైనా ఐకెపి అధికారులు, రైస్ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను ఇబ్బందుల పాలుచేయకుండా గతంలో కొనుగోలు చేసిన మాదిరిగానే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. వడ్లలో తాళ్లు ఎక్కువగా ఉన్నాయంటూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో ధాన్యాన్ని భద్రపరచడానికి కావాల్సినన్ని టార్ఫిలిన్ కవర్ లేకపోవడంతో ధాన్యం తడిచిపోతుందని, తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

  • తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన రైతులు.

ఐకెపి కొనుగోలు కేంద్రంతో పాటు, తూముకుంట సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలని, తరుగు పేరుతో రైతులను ఇబ్బందుల పాలు చేయవద్దని, ధాన్యానికి సరిపడా గన్ని బ్యాగులో రైతులకు అందుబాటులో ఉంచాలంటూ తాసిల్దార్ వరలక్ష్మికి రైతులు వినతి పత్రం అందజేశారు, తాసిల్దార్ వరలక్ష్మి మాట్లాడుతూ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాసిల్దార్ వరలక్ష్మి తెలిపారు.తాసిల్దార్ హామీతో రైతులు రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో రైతులు వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీను, గంగులు, జుర్రు నారాయణ, ఊసన్న, తిరుపతయ్య,శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

  • తాళ్లు ఎక్కువగా లేకుండా శుభ్రం చేసి ఇయ్యాలి.

రైతులు కొనుగోలు కేంద్రాలకు విక్రయించడానికి తెచ్చిన ధాన్యంలో తాళ్లు మట్టి లేకుండా చేయాలని, తాళ్లు ఎక్కువగా ఉండటంవల్ల కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోకుండా వెనుకకు పంపుతున్నారని మహిళా సమైక్య బుక్ కీపర్ రవి అన్నారు.విక్రయించడానికి ఇచ్చిన ధాన్యంలో తాళ్లు లేకుండా చేసే బాధ్యత రైతుల దేనిని అధికారులు కూడా రైతులకు తెలిపినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.