Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో అదనపు కలెక్టర్‌కు బీజేపీ వినతి పత్రం… ప్రజా సమస్యల పరిష్కారంపై డిమాండ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్‌ను కలిసి పలు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదలలో ఆలస్యం జరుగుతుండటంపై, నిరుద్యోగ భృతి చెల్లింపులు నిలిచిపోయిన నేపథ్యంలో యువతలో అసంతృప్తి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ల మంజూరులో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేయాలని కోరారు. రైతు భరోసా సాయం ఆలస్యంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.భూ సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భూభారతి సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మౌలిక వసతులు మెరుగుపరచాలని సూచించారు.  అలాగే నివాస, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల జారీని వేగవంతం చేయాలని అధికారులను కోరారు.
ప్రత్యేక డిమాండ్లు బీజేపీ నాయకులు పలు ప్రత్యేక అభివృద్ధి పనులపై కూడా తమ డిమాండ్లను వ్యక్తం చేశారు. KLI పంప్‌సెట్ మోటార్‌ను మరమ్మత్తు చేసి తిరిగి వినియోగంలోకి తేవాలని కోరారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా చివరి మండలాలకు కూడా నీటి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
సర్వారెడ్డి పల్లి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేయాలని, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే పాలమూరు ఎత్తిపోతల పథకానికి పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు అధికారులను విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.