Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్;

డయాలసిస్ కేంద్రానికి నేటి నుంచి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా
ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి

పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించిన మంత్రి, ఆసుపత్రికి నేటి నుంచే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు. విద్యుత్ అంతరాయం కారణంగా చికిత్సలో ఏర్పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాల్లోనే ఆధునిక వైద్య సేవలు, పరీక్షలు, నాణ్యమైన మందులు పూర్తిగా ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిలో త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డయాలసిస్ కేంద్రంలో అదనపు బెడ్లు, ఏసీల ఏర్పాటు చేయడంతో పాటు రోగుల అవసరాల కోసం ప్రత్యేకంగా మరో అంబులెన్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

గత 2018లో రూ.22 కోట్ల వ్యయంతో మంజూరైన 100 పడకల నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే దామోదర రాజనర్సింహా చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సౌకర్యార్థం ఆసుపత్రి వద్ద రూ.5 లక్షల వ్యయంతో నూతన బస్ షెల్టర్ నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ రోగులకు అండగా నిలవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.