Take a fresh look at your lifestyle.

ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవలు అభినందనీయం : జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ మనోహర్

 

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

ప్రజల ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవలు అభినందనీయమని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో జిల్లాలో సేవలందిస్తున్న నర్సింగ్ సిబ్బందికి  వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన నర్సింగ్ అధికారులను శాలువాలతో సన్మానించి, వారి సేవలను ప్రశంసించి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. నర్సులు ప్రజల ఆరోగ్య సంరక్షణలో, ముఖ్యంగా తల్లీ-శిశు సంరక్షణ, టీకా కార్యక్రమాలు, అత్యవసర సేవలు వంటి విభాగాల్లో అందిస్తున్న సేవలు అపారమని ఆయన పేర్కొన్నారు. నర్సింగ్ వృత్తి అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా ఒక సేవా ధర్మమని, కష్టసమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ, ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవని తెలిపారు. నర్సులు ఎల్లప్పుడూ తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో, అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం & హెచ్ ఓ యశోద, ప్రోగ్రామ్ ఆఫీసర్లు వీణ, రామకృష్ణ, పద్మ, సత్యవతి  పాల్గొని, నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.