Take a fresh look at your lifestyle.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర మల్కాజిగిరి:

మల్కాజిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఆశా వర్కర్లు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ మహిళలు,ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఆశా వర్కర్లుగా పనిచేస్తూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు ఆ హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే 50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50 వేల అంత్యక్రియల సహాయం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి హామీలు అమలు చేయాలని కోరారు. పిఆర్సీ ఏరియర్స్, లెప్రసీ, పల్స్ పోలియో, ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన బకాయిలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రతినెల అందాల్సిన పారితోషికాలు కూడా సకాలంలో అందకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎన్‌హెచ్‌ఎమ్‌కు నిధులు పెంచాలని ఆశా వర్కర్లు ఎమ్మెల్యేను కోరారు.
అదేవిధంగా వెంకటాపురం డివిజన్‌లోని సుభాష్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రస్తుతం అద్దె భవనంలో పనిచేస్తోందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ భవనాలకు మారాల్సి వస్తే ఇంద్రానగర్ బస్ దవాఖాన లేదా మహిళా మండలికి మార్చాలని ఎమ్మెల్యే ని కోరారు.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ , డిఎంహెచ్ఓ డా. ఉమా గౌరి దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ తాత్కాలికంగా అదే భవనంలో కొనసాగేందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఆశా వర్కర్ల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే , వారి సమస్యలను తప్పనిసరిగా అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ యుబిఎస్‌సి డాక్టర్ నౌరిన్ బేగం, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సభ్యులు ఉన్నికృష్ణన్, ఆశా వర్కర్లు కమల, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.