- రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం కొనసాగుతోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టింపు లేదని ఆయన మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 402 మంది రైతుల మరణాల బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను హరీష్ రావు విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు రైతుల తరపున కొట్లాడతామని ఆయన పేర్కొన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనమని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆయన విమర్శించారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.